2019లో మాదే అధికారం అంటున్న చిరంజీవి

chiranjeevi

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్‌ కొణిదల చిరంజీవి త‌న 150 వ సినిమా ఖైదీ నంబ‌ర్ 150 విడుద‌ల సంద‌ర్భంగా వివిధ టీవీ ఛాన‌ల్ల‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ఆ చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు స్తబ్ధుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగానే ఉన్నానని చిరంజీవి తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఎలుకను పట్టడం కోసం కొండను తవ్వినట్టుగా పెద్దనోట్ల రద్దు ఉందని ఆయన చెప్పారు. మొసళ్ళను పట్టడం కోసం నీళ్ళన్నీ తోడేశారని చిన్న చిన్న చేపలు ఎండిపోతున్నాయని చమత్కరించారు. పెద్దనోట్లను రద్దుచేసి రెండు నెలలు దాటుతున్నప్పటికీ ప్రజల కష్టాలు ఇంకా తీరలేదని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో యూపీఏకు ప్రజలు పట్టం గడతారని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన అనంతరం తాను అనుకున్నది సాధించగలేకపోయానని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చి ఉంటే సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించే వాళ్ళమని అన్నారు. ఏ కొద్దిమంది చేతుల్లోనూ, ఏ వర్గంలో చేతుల్లోనూ రాజ్యాధికారం ఉండేది కాదని అన్నారు. తనవంతు బాధ్యతగా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున 103 సీట్లను బీసీలకు ఇచ్చానని గుర్తుచేశారు. అల్ప సంఖ్యాక వర్గాలకు (మైనారిటీలకు) ఏ పార్టీ ఇవ్వనన్ని సీట్లు ఇచ్చి వారి విజయానికి కృషి చేశానని చెప్పారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలవుతుందని చిరంజీవి జోస్యం చెప్పారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిన పనితో దేశంలో నల్లధనం లేదని బయట పడిందని ఆయన చెప్పారు. 15 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ వినియోగంలో ఉందన్న విషయాన్ని భారత రిజర్వు బ్యాంకు ప్రకటించిందని ఆయన తెలిపారు. అందులో 14 లక్షల కోట్ల పైచిలుకు మొత్తం ఆర్‌బిఐకి చేరిందని ఆయన పేర్కొన్నారు. అలాంటప్పుడు నల్లధనం ఎక్కడుందని ప్రశ్నించారు. ఈ లెక్కన దేశంలో నల్లధనం అన్నదే లేదని, నల్లధనం ఉందో.. లేదో తెలుసుకోకుండానే పెద్దనోట్లను రద్దుచేశారని, దీని కారణంగా దేశంలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని ఆయన చెప్పారు. వారంతా మౌనంగా ఊరుకుంటారా? అంతకూ అంత పగ తీర్చుకుంటారని, అయితే ఆ రోజుకోసం ఎదురు చూడాలని చిరంజీవి అన్నారు. పెద్దనోట్ల రద్దు అంశాన్ని వినియోగించుకుంటే కాంగ్రెస్‌ పార్టీకి విజయ అవకాశాలు మరింత పెరుగుతాయని ఆయన చెప్పారు. ఇకపై సినిమాలు, రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకు వెళతానని అన్నారు.

ఏపీ ప్రత్యేక హోదాపై ప్రస్తావిస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో హోదాపై ఏమీ చేయలేనని, అదంతా అధికార తెలుగుదేశం పార్టీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు హోదాపై ఒక్కో సమయంలో ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని, ఒక సమయంలో హోదా రావాలని డిమాండ్‌ చేశారని, మరోసారి హోదా ఏమైనా సంజీవనియా? హోదా వస్తే లాభమేంటి? అని ప్రశ్నించారని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను చంద్రబాబే నీరుగార్చారని ఆరోపించారు. హోదా కోసం ప్రయత్నిస్తే వారితో పాటు తాను కూడా పోరాడుతానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి ఉండాలని తాను అనుకోవడం లేదని చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌, తన గమ్యం ఒక్కటేనని, మార్గాలు వేరని చెప్పారు. ఇరువురం కలిసి ఎన్నికల్లో పనిచేస్తామని తాను ఏమాత్రం అనుకోవడం లేదని ఆయన చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడూ ఒకేలా ఉన్నాడని చెప్పారు. చిన్నప్పటి నుంచి పవన్‌ వైఖరి అంతేనని, ఆయన అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ ఒకేలా ఉన్నాడని పవన్‌నుద్దేశించి చిరంజీవిచెప్పారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ ఇమేజ్‌ పెరుగుతున్న కొద్ది ప్రజలు ఆయనను చూసే విధానం మారిందని, దీంతోనే అభిమానులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పారు.

కుటుంబమంతా హాల్‌లో మాట్లాడుకుంటుంటే పవన్‌ కళ్యాణ్‌ తన పడక గదిలో దూరి పుస్తకం చదువుకునేవాడని గుర్తుచేశారు. మొదటినుంచీ ఇంట్రవర్ట్‌ అని పెద్దగా మాట్లాడడని తెలిపారు. ఇప్పటికిప్పుడు పవన్‌తో కలిసి రాజకీయాల్లో పనిచేసే అవకాశం లేదని అయితే ఎప్పటికైనా పనిచేసే అవకాశం ఉందని, దానిని ఇప్పడే చెప్పలేనని చిరంజీవి చెప్పారు. పదేళ్ళు రాజకీయ బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ తనలో ఏదో తెలియని ఒత్తిడి ఉండేదని చెప్పారు. ఇన్నేళ్ళ తర్వాత సినిమాలో నటించడం ఆనందంగా ఉందని అన్నారు. సినిమాల్లోకి తిరిగి రావడం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని, తెలుగులో మంచి కథలిచ్చే రచయిత తమకు దొరకలేదని చెప్పారు. మాస్‌ మసాలతో మంచి సందేశాన్నిచ్చే సినిమా కత్తి అని, ఈ సినిమా తనకు సరిగ్గా సూటవుతుందని భావించి దీనిని 150వ సినిమా ఎంచుకున్నానని చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ బిజీగా ఉండడంవల్లే గుంటూరులో జరిగిన ఖైదీ నంబర్‌ 150 ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కు రాలేకపోయారని చెప్పారు. కుటుంబ విబేదాల వల్లే పవన్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదనే ప్రశ్నను ఆయన తోసిపుచ్చారు. చిన్నప్పటి నుంచి పవన్‌ ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడని, అతనికి మంచి ఐడియాలజి ఉందని చెప్పారు.
150వ సినిమాలో నటించాలని నిర్ణయం తీసుకున్నాక ముందు శారీరకంగా సన్నద్ధం కావాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో మేకోవర్‌ సాధించేందుకు చాలా కష్ట పడ్డానని, మామూలుగా తాను మంచి భోజన ప్రియుడినని అయితే నచ్చినదంతా తినకుండా తన సతీమణి సురేఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేదని చెప్పారు. కొంచెం కూడా ఎక్కువ తిననిచ్చే వారు కాదని అన్నారు. తన తనయుడు రాంచరణ్‌ తనకు ట్రైనర్‌గా మారారని అన్నారు. బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని భావించినా ఊరుకునే వారు కాదని తనను మరింత ఉత్సాహపరిచి జిమ్‌కు తీసుకువెళ్ళేవాడని అలా వారిద్దరి సహకారంతో మేకోవర్‌ పాటించానని చెప్పారు. 150వ సినిమాలో తాను ఫిట్‌గా కనిపించేందుకు వారిద్దరు సహకరించారని గుర్తుచేశారు. ఖైదీ నంబర్‌ 150 ఫంక్షన్‌లో రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌, దర్శకుడు రాంగోపాల్‌ వర్మలపై తన సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందిస్తూ, తమ కుటుంబంపై చేసే ట్వీట్స్‌, కామెంట్స్‌ను చూస్తున్నామని, అలాంటప్పుడు కొంత ఆగ్రహానికి గురికావడం తప్పదని చెప్పారు. తన స్టేచర్‌కు ఇవన్నీ సరిపోవు కనుక తననుంచి వాటిని బ్రేకవుట్‌ చేసేస్తానని తెలిపారు. అయితే నాగబాబు తనలా తీసుకోలేకపోయారని అన్నారు.
నాగబాబు స్పందన సరైందేనని సమర్థించారు. రాంగోపాల్‌ వర్మతో తమ కుటుంబానికి ఎలాంటి విభేదాలు లేవని ఆయన నేచరే అంతని విరుచుకుపడ్డారు. అనవసరంగా ఆయన తమ కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని మీడియాలో మైలేజీ కోసమే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. యండమూరి అంటే నాగబాబుకు చాలా ఇష్టమని, ఆయన పాదాలకు నమస్కరిస్తాడని తెలిపారు. అలాంటి వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడడం సరికాదని అన్నారు. ఆయన బహిరంగ సభల్లో తన సతీమణి సురేఖను సైతం ఏకవచనంతో సంబోధించడం ఎంతవరకు సంస్కారమో ఆయన చెప్పాలని అన్నారు. నాగబాబు చేసింది నూటికి నూరుశాతం సరైందేనని ఇక ఈ విషయంలో నాగబాబు మాట్లాడుతాడని తాను భావించడం లేదని అన్నారు. అవతలి వారు మాట్లాడితే వారి స్థాయికే వదిలేస్తున్నామని చిరంజీవి చెప్పారు.

NO COMMENTS

Leave a Reply