తెలంగాణ‌ను మెచ్చుకున్న ఇంకో కేంద్ర‌మంత్రి

kalraj-mirshra-central-minister

స్వ‌రాష్ట్రంగా అవ‌త‌రించిన త‌ర్వాత అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం ఈ క్ర‌మంలో త‌న‌దైన శైలిలో అనేక అంశాల్లో ప్ర‌త్యేక ముద్ర‌ను వేసుకున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కొత్త‌ను స్వాగ‌తించ‌డంలోనూ ముందు ఉంద‌ని మ‌రోమారు రుజువైంది. పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం త‌ప్ప‌నిస‌రి అయిన నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహంలో తెలంగాణ ప్రభుత్వ కృషి అభినందనీయమని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా చెప్పారు.

హైద‌రాబాద్ లోని బాలానగర్‌లోని నర్సాపూర్ ఎస్‌ఎంఎంఈ ఆడిటోరియంలో డిజిటల్ చెల్లింపులు, జీఎస్టీ అమలుపై జరిగిన అవగాహన సదస్సులో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా మాట్లాడారు. దేశంలోని నల్లధనాన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందన్నారు. తమ ప్రయోజనాల పరిరక్షణకు ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలు ప్రశంసిస్తున్నారని చెప్పారు. నగదు రహిత లావాదేవీల వల్ల అవినీతికి తావు లేకుండా కార్యక్రమాలన్నీ పారదర్శకంగా కొనసాగుతాయన్నారు. దేశ ప్రజలు నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడాలన్నారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండటం హర్షనీయమని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రా అన్నారు.

NO COMMENTS

Leave a Reply