రివ్యూ : భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌

nani

రివ్యూ భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌

సినిమా: భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌

న‌టీన‌టులు: నాని, లావ‌ణ్య‌త్రిపాఠి, ముర‌ళీశ‌ర్మ‌, సీనియ‌ర్ న‌రేష్‌, సితార‌, అజ‌య్‌, వెన్నెల కిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి త‌దిత‌రులు

బ్యాన‌ర్‌: గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేష‌న్స్‌

సంగీతం: గోపీ సుంద‌ర్‌

క‌థ‌, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: మారుతి

రిలీజ్ డేట్‌: 4 సెప్టెంబ‌ర్‌, 2015

కొద్ది రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో నాని, అందాల రాక్ష‌సి ఫేం లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన సినిమా భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేష‌న్స్ లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌లు నిర్మించిన ఈ సినిమాకు మారుతి కేరీర్‌లోనే తొలి సారిగా క్లీన్ యూ సర్టిఫికేట్ రావ‌డంతో సినిమాలో ఏం ఉంటుందా అని చాలా మంది ఆస‌క్తితో ఉన్నారు. శుక్ర‌వారం రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

లక్కి (నాని) మొక్కల మీద పరిశోధన చేసే శాస్త్రవేత్త. నానికి ఉన్న లోపం ఏంటంటే ఒక ప‌ని మ‌ధ్య‌లో మ‌రో ప‌ని గుర్తొస్తే ముందు చేసే ప‌ని మ‌ర్చిపోతాడు. ఈ టైంలో ల‌క్కీ పాండురంగ రావు (మురళి శర్మ) ను కలుస్తా అని చెప్పి మరిచిపోతాడు. అప్ప‌టి నుంచి ల‌క్కీ అంటే పాండురంగారావుకు స‌ద‌భిప్రాయం ఉండ‌దు. ఈ మ‌తిమ‌రుపు ల‌క్కీ ఫ‌స్ట్ చూపులోనే నందిని (లావణ్య త్రిపాఠి) ని ప్రేమిస్తాడు. ఆమె ముందు తన మతిమరుపు లోపం బయటపడకుండా ఉండటానికి నానా పాట్లు ప‌డ‌తాడు. అనేక అనేక సాకులు చెపుతూ బండి లాగిస్తుంటాడు. అయితే ల‌క్కీకి మ‌తిమ‌రుపు ఉంద‌న్న విష‌యం నందినికి మాత్రం తెలియ‌దు. ఇదిలా ఉండ‌గా మ‌న ప్రేమ‌కు త‌న తండ్రి ఒప్పుకున్నాడ‌ని నందిని చెపుతుంది. నందిని తండ్రిని క‌ల‌వ‌డానికి వెళ్లిన ల‌క్కీకి పెద్ద షాక్ త‌గులుతుంది ? ఇంత‌కు ఆ షాక్ ఏమిటి ? వీరి జీవింతోకి వ‌చ్చిన పోలీస్ ఆఫీస‌ర్ అజ‌య్ ఎవ‌రు ? ల‌క్కీ లోపం గురించి నందినికి తెలిసిందా ? చివ‌ర‌కు క‌థ ఏమైంది అన్న‌ది తెర‌మీద చూసి తెలుసుకోవాలి.

న‌టీన‌టులు ప‌నితీరు:

నాని పాత్ర చాలా కొత్త‌గా ఉండ‌డం ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఫ్ల‌స్ పాయింట్‌. మెమ‌రీ లాస్ పేషెంట్‌గా నాని చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇక సెంటిమెంట్‌, ఎమోష‌న‌ల్ సీన్ల‌లో కూడా చ‌క్క‌గా న‌టించాడు. ఇక అందాల రాక్ష‌సి త‌ర్వాత అంద అందంగా క‌నిపించింది హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి. కాస్త గ్లామ‌ర్ డోస్ పెంచేసింది. ఆమె అందాల ఆర‌బోత కూడా సినిమాకు క‌లిసొచ్చింది. ఇక ప్ర‌వీణ్, వెన్నెల కిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి కామెడీ బాగుంది. హీరో త‌ల్లిగా సితార కూడా ప‌ర్వాలేద‌నిపించింది. హీరోయిన్ తండ్రి ముర‌ళీశ‌ర్మ త‌న క్యారెక్ట‌ర్‌కు నూటికి నూరుశాతం న్యాయం చేశాడు.

సాంకేతిక‌త‌:

సాంకేతిక నిపుణుల్లో ష‌పీ సినిమాటోగ్ర‌ఫీ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. ఎడిటింగ్ బాగున్నా..సెకండాఫ్‌లో మ‌తిమ‌రుపు స‌న్నివేశాలు గురించి ప‌దే ప‌దే తిప్పిచెప్పిన సీన్లు క‌ట్ చేయొచ్చ‌నిపించింది. గోపీసుంద‌ర్ సంగీతం బాగుంది. పాట‌లు విన‌డానికి, తెర‌మీద చూడ‌డానికి కూడా బాగున్నాయి. గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేష‌న్స్ నిర్మాణ విలువ‌లు కూడా సూప‌ర్‌. ఇక మారుతి డైరెక్ష‌న్ విష‌యానికి వ‌స్తే క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. మ‌తిమ‌రుపు క్యారెక్ట‌ర్ బేస్ చేసుకుని గ‌తంలో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. స్ర్కీన్‌ప్లేలో జిమ్మిక్కులు కూడా లేవు. అయితే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు లాజిక్‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి కామెడీ డోస్ త‌గ్గ‌కుండా ప్రేక్ష‌కుడ్ని న‌వ్వించ‌డంలో మాత్రం స‌క్సెస్ అయ్యాడు. సినిమా స్లో న‌రేష‌న్‌లో ఉన్నా డైరెక్ష‌న్ ప‌రంగా క్లిక్ అవ్వ‌డంతో సినిమాకు క‌లిసొచ్చింది..అదే క‌మ‌ర్షియ‌ల్‌గా సినిమాను నిల‌బెట్టేసింది. ఓవ‌రాల్‌గా ఓకే అనిపించింది..

ఫ్ల‌స్ (+):

నాని యాక్టింగ్‌

కావాల్సినంత కామెడీ

సినిమాటోగ్ర‌ఫీ

నిర్మాణ విలువ‌లు

సంగీతం

మైన‌స్‌లు (-)

అక్క‌డ‌క్క‌డా సాగ‌దీత స‌న్నివేశాలు

స్లోగా ఉన్న సెకండాప్ న‌రేష‌న్‌

క్లైమాక్స్‌

స్ర్కీన్‌ప్లే

ఫైన‌ల్‌గా…

ఈ సినిమాతో మారుతి యూ(బూ)తు చిత్రాల ద‌ర్శ‌కుడి ఇమేజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి తాను ఇటు ఫ్యామిలీ చిత్రాలు కూడా తీస్తాన‌ని నిరూపించుకున్నాడు. క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా..స్లో న‌రేష‌న్ ఉన్నా…సినిమాలో ఏం జ‌రుగుతుందో ప్రేక్ష‌కుడు బుర్ర ముందే ప‌సిగ‌ట్టేసినా సినిమాకు కామెడీయే శ్రీరామ‌ర‌క్ష‌గా నిలిచింది. నాని కేరీర్‌లో మ‌రో హిట్‌గా భ‌లే భ‌లే మ‌గాడివోయ్ నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ భేలే భ‌లే మ‌గాడివోయ్ మీకు భ‌లే భ‌లేగానే న‌చ్చుతుంది.

భ‌లే భ‌లే మగాడివోయ్ మూవీ రేటింగ్‌: 3/5

NO COMMENTS

Leave a Reply