“అవును-2” సినిమా రివ్యూ

– అవును 2 స‌మీక్ష‌
న‌టీన‌టులుః హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, పూర్ణ‌, నిఖిత‌, సంజ‌న త‌దిత‌రులు
రీరికార్డింగ్ః శేఖ‌ర్‌చంద్ర‌
ద‌ర్శ‌క‌త్వం: ర‌విబాబు
నిర్మాత‌లు: ర‌విబాబు, డి.సురేష్‌బాబు
బ్యాన‌ర్స్ః ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌

రేటింగ్ : 2 / 5

సింగిల్‌లైన్ః ఆత్మ క‌న్నె పిల్ల మీద మోజుప‌డితే, ఆ కోరిక నెర‌వేర‌క‌పోతే ఏం జ‌రుగుతుంది? అన్న‌దే క‌థాంశం. అవును చిత్రానికి కొన‌సాగింపు క‌థ ఇది.

ముందొక మాటః హార‌ర్ సైకోటిక్ జోన‌ర్‌లో వ‌చ్చిన అవును తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త‌ద‌నాన్ని చూపించింది. అందుకే అది పెద్ద విజ‌యం సాధించింది. ఇప్పుడు అదే క‌థ‌కి కొన‌సాగింపు తెర‌కెక్కించారు.  అయితే అవును తొలిభాగంలో గృహిణి మీద మ‌న‌సు ప‌డ్డ ఆత్మ అక్క‌డ కోరిక నెర‌వేర్చుకోలేక‌పోతుంది. రెండో భాగంలో నెర‌వేర్చుకుందా?  లేదా అన్న‌దే సినిమా. ర‌విబాబు మార్క్ సినిమా ఇది. అయితే తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయా?  లేదా? అస‌లు ఆత్మ అత్యాచార య‌త్నం ఫ‌లించిందా?  లేదా అన్న‌ది తెలియాలంటే ఇది చ‌ద‌వాల్సిందే.

క‌థ‌క‌మామీషుః

మోహిని-హ‌ర్ష కొత్త జంట‌. అప్పుడే కొత్త‌గా అపార్ట్‌మెంట్‌లోకి దిగుతారు. అయితే వాళ్ల‌కు అనుకోని రీతిలో ఓ కామాంధ ఆత్మ కెప్టెన్ రాజు నుంచి ఎటాక్ మొద‌ల‌వుతుంది. ఇంకా శోభ‌నం అయినా పూర్తి కాకుండా ఫ్రెష్‌గా ఉన్న మోహిని అంటే ఆ దెయ్యం మోజు ప‌డుతుంది. ఆ క్ర‌మంలో మోహిని చుట్టూ తిరుగుతూ అంగాంగం త‌డిమేస్తూ ఉంటుంది. ఆ క్ర‌మంలో ఎన్నో ప‌రిణామాలు. ఇదంతా పాత క‌థ‌. అవును క‌థలో కెప్టెన్ రాజు ఆత్మ హ‌ర్ష (హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌)లో ప్ర‌వేశించి మోహిని (పూర్ణ‌)పై అత్యాచారానికి ప్ర‌య‌త్నిస్తుంది. ఆ క్ర‌మంలో చేతికి దొరికిన క‌త్తి పుచ్చుకుని మోహిని హ‌ర్ష‌ని ఇష్టానుసారం పొడిచేస్తుంది. అక్క‌డితో తొలి భాగం ఎండ్ కార్డ్ వేశారు. రెండో భాగంలో అక్క‌డినుంచే క‌థ మొద‌ల‌వుతుంది. క‌త్తిపోట్ల నుంచి ఏదోలా బైట‌ప‌డ‌తాడు హ‌ర్ష‌. తిరిగి కొత్త‌జంట కొత్త అపార్ట్‌మెంట్‌లో కాపురం మొద‌లుపెడ‌తారు.  అక్క‌డా కెప్టెన్ రాజు వ‌దిలిపెట్ట‌డు. ఆత్మ రూపంలో మోహినిని వెంట‌ప‌డి త‌రుముతుంటాడు. అయితే ఈ కొత్త‌జంట విష‌యంలో జ‌రుగుతున్న ఘోరం తెలుసుకుని హ‌ర్ష త‌ల్లిదండ్రులు బిడ్డ‌ల్ని చూడ‌డానిక‌ని బ‌య‌ల్లేరి వ‌స్తుంటే దారిమ‌ధ్య‌లోనే యాక్సిడెంట్ జ‌రిగి చ‌నిపోతారు. వారి అస్తిక‌ల్ని కాశీలోని గంగ‌లో క‌లిపేప్పుడు ఒక అఘోరా ఓ ర‌క్ష రేకును మోహినికి ఇచ్చి సంవ‌త్స‌రం పాటు ఒంటిపై నుంచి తొల‌గించ‌వ‌ద్ద‌ని చెబుతాడు. అయితే మోహిని ఇంట్లో ప‌ర‌ధ్యానంగా ఉన్న‌ప్పుడు దానిని తీసి ప‌క్క‌న‌బెడుతుంది. అప్పుడు మ‌ళ్లీ ఆత్మ దాడి మొద‌లవుతుంది. ఒక‌టికి రెండుసార్లు ఇలాంటి ఎటాక్‌లు జ‌రుగుతాయి. ర‌క్ష‌రేకును మోహిని నుంచి దూరం చేసి ఏదోలా త‌న‌ని మాన‌భంగం చేయాల‌ని ఆత్మ విఫ‌ల‌య‌త్నాలు చేస్తుంటుంది. ఆ క్ర‌మంలోనే అది ఒక‌సారి భ‌ర్త హ‌ర్ష‌ని ఆవ‌హించి నానా హింస‌లు పెడుతుంది. ర‌క్షించ‌డానికి వ‌చ్చిన స్నేహితుడిని కూడా ఆత్మ వ‌దిలిపెట్ట‌దు. అత‌డిలోనూ ప్ర‌వేశించి మోహినిపై కోరిక తీర్చుకోవాల‌ని చూస్తుంది. ఒకానొక ఎపిసోడ్‌లో ఆత్మ‌ల‌పై ప‌రిశోధించే సంజ‌న ఈ కొత్త జంట మ‌ధ్య‌లో దూరిన ఆత్మ‌ను క‌నిపెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది. అలా వ‌చ్చిన సంజ‌న అర్థాంత‌రంగా ఆత్మ హ‌త్యాచారానికి బ‌లైపోతుంది. బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందిన ఆత్మ భూమ్మీద స‌రిగ్గా ఏడాది పాటు తిరుగుతుంది. తొలిసంవ‌త్స‌రీకం పూర్త‌యితే ఇక దాని గ‌డువు ముగిసిన‌ట్టే. ఇహ‌లోకాన్ని వ‌దిలి ప‌ర‌లోకం వెళ్లాల్సిందే. ఈ లాజిక్ ప్ర‌కారం ఆత్మ భూమిని, మోహినిని వ‌దిలి వెళ్ల‌డానికి ఇంకో అర‌గంట ఉంది అన‌గానే అస‌లు ఎపిసోడ్ మొద‌ల‌వుతుంది. మోహినికి , మోహిని భ‌ర్త‌కి, అత‌డి స్నేహితుడికి చుక్క‌లు చూపిస్తుంది. అయినా చివ‌రికి అనుకున్న‌ది సాధించుకోలేక‌పోతుంది. అర్థ‌రాత్రి 12 త‌ర్వాత కూడా ఇక భూమిని వ‌దిలి వెళ్లిపోయింది అనుకున్న ఆత్మ .. ఎక్క‌డికీ వెళ్ల‌దు. భూమ్మీదే ఇంకా ఉండిపోతుంది. మ‌రి రెండో భాగాన్ని కూడా ఎండ్ చేయ‌లేదు కాబ‌ట్టి .. ఈ సినిమాకి కూడా కొన‌సాగింపు ఉంద‌నే అర్థం వ‌చ్చింది. పార్ట్ 3, పార్ట్ 4 కూడా ర‌విబాబు తెర‌కెక్కిస్తాడ‌ని తెలిసిపోతుంది.

ప్ల‌స్ పాయింట్స్ః ఓ 20నిమిషాల పాటు గ్రాఫిక్స్ మాత్రం మైమ‌రిపిస్తాయి. ఆత్మ ప్ర‌వేశం, ఎగ్జిట్‌, రేప్ ఎటెంప్ట్‌, శ‌త్ర‌వుపై ఎటాక్ .. ఇలా ప్ర‌తి సంద‌ర్భంలో ఆత్మ ప‌నిత‌నాన్ని చ‌క్క‌గా చూపించాడు ర‌విబాబు.

మైన‌స్ పాయింట్స్ః క‌థాంశంలో ఏ మార్పు లేదు. క‌థ‌తో పాటు స‌న్నివేశాలు కూడా అవే. కొత్త‌గా ఏదీ క‌నిపించ‌దు. అలాగే శేఖ‌ర్‌చంద్ర రీరికార్డింగ్ టూమ‌చ్‌. అన‌వ‌స‌ర‌మైన‌, సంద‌ర్భం లేని భీక‌ర శ‌బ్ధాలు వినిపించాయి త‌ప్ప అది ఎక్క‌డా అద్భుతం అని అనిపించ‌దు. ఆత్మ ఆవాహం అనుకున్న సంద‌ర్భంలో సైతం అనవ‌స‌ర‌మైన పొలికేక‌లు వినిపించిన‌ట్టే ఉంది కానీ ఎక్క‌డా ప్ర‌మాణాలు పాటించ‌ని సౌండింగ్‌ని వినిపించాడు. కొన్నిసార్లు భీక‌ర‌మైన శ‌బ్ధం వినిపించిన‌ప్పుడు చెవులు చిల్లులు ప‌డుతున్నాయా అనిపించ‌క మాన‌దు. సినిమాటోగ్ర‌ఫీ మాత్రం చాలా బావుంద‌నిపిస్తుంది.

ముగింపుః ఆత్మ అత్యాచార‌య‌త్నం ఫెయిల్‌. తొలిభాగంలో అనుకున్న‌ది సాధించ‌క‌పోయినా జ‌నాల‌కు కొత్తగా క‌నిపించింది. అందువ‌ల్ల అనుకున్న వ‌సూళ్లు తెచ్చుకోగ‌లిగింది. ఇప్పుడు మ‌ళ్లీ అదే పాత క‌థ‌ని కొత్త అపార్ట్ మెంట్‌లో చూపించాడు కాబ‌ట్టి .. జ‌నాల‌కు థ్రిల్ అనిపిస్తుందా? అన్న‌ది సందేహ‌మే. సినిమా కంటెంట్‌లో ఎక్క‌డా కొత్త ఎటెంప్ట్ అనేదే లేదు కాబ‌ట్టి రొటీన్ అనిపించ‌క మాన‌దు.

రేటింగ్ : 2 / 5

NO COMMENTS

Leave a Reply