తెలంగాణ‌లో మ‌రో పారిశ్రామిక విప్ల‌వం!

kcr-facebook-page

తెలంగాణ రాష్ట్రం మ‌రో ప్ర‌ముఖ రంగంలో త‌న స‌త్తా చాటుకునేదిశ‌గా సాగుతున్న‌ది. ఇప్ప‌టికే ఐటీ రంగంలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌ల‌కు గ‌మ్య‌స్థానంగా మారిన మ‌న రాష్ట్రం త్వ‌ర‌లో వాహ‌నాల‌ను ఉత్ప‌త్తి చేసే కేంద్రంగా మార‌నుంది. ఈ దిశగా రాష్ట్రప్రభుత్వం క్రియాశీలంగా ముందుకు సాగుతుంది. వాహనరంగ అభివృద్ధి కోసం త్వరలోనే ప్రత్యేక విధానాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. పరిశ్రమల శాఖ అధికారులు ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు విధానాలను అధ్యయనం చేసి దీనిని రూపొందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం అనంతరం దీనిని ఆవిష్కరించనున్నారు.

రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు మెదక్‌ జిల్లాలో కార్ల పరిశ్రమ కోసం భూములను కేటాయించినా ఇప్పటి వరకు అది ప్రారంభం కాలేదు. వాహనోత్పత్తి రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలుంటాయి. ఇప్పటివరకు వాహనోత్పత్తి రంగంలో తెలంగాణ అనుకున్నంత వేగంగా ముందుకు సాగ‌డం లేదు. వాహ‌నాల‌ ఉత్ప‌త్తి రంగాన్ని ప్రోత్స‌హించ‌డంలో భాగంగా బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల తయారీని చేపట్టేందుకు వీలుగా అవకాశాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. భారీఎత్తున పెట్టుబడుల సమీకరణతో పాటు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రతిపాదనలను రూపొందించింది. వ్యాపారపరంగా యజమానులకు, పన్నుల రూపేణా ప్రభుత్వానికి లబ్ధి కలుగుతుంది. ఒక్కో వాహన పరిశ్రమకు కనిష్టంగా రూ.200 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయి. మరోవైపు ప్రధాన పరిశ్రమలకు అనుబంధంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటవుతాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో వాహన పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు కావడంతో అక్కడ పారిశ్రామిక రంగం బలోపేతమయింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం వాహన పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని నిర్ణయించింది.

వాహన పరిశ్రమలను జనావాసాలకు దూరంగా జాతీయ, రాష్ట్ర రహదారులకు, రైల్వే లైన్లకు సమీపంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అన్ని వసతులతో కూడిన ఆటోనగర్‌లను ప్రారంభించనుంది. మొదటి దశలో ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, మంచిర్యాల, కరీంనగర్‌, రామగుండం, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, యాదాద్రి, మిర్యాలగూడల్లో ఆటోనగర్‌లు ఏర్పాటవుతాయి. వీటి కోసం ఆయా జిల్లాల్లో వెయ్యి ఎకరాల చొప్పున స్థలాన్ని గుర్తించాలని ప్రభుత్వం సంబంధిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ స్థలాల్లో మౌలిక వసతులు కల్పించిన తర్వాత పరిశ్రమలకు భూములను కేటాయిస్తారు. గతంలో మాదిరిగా కాకుండా ఒక్కో పరిశ్రమకు ఎకరం నుంచి రెండేసి ఎకరాల వరకు కేటాయిస్తారు. ప్రతీ పరిశ్రమలో అయిదువేల మందికి చొప్పున ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. ఈ నిర్ణ‌యంతో తెలంగాణ మ‌రోమారు పారిశ్రామిక విప్ల‌వాన్ని చూడ‌బోతున్నామ‌ని అంచ‌నా వేస్తున్నారు.

NO COMMENTS

Leave a Reply