ఆంధ్రా టీడీపీలో రేవంత్ ర‌చ్చ‌

revanth4

తెలంగాణ – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు విడిపోయిన త‌రువాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ దాదాపు క‌నుమ‌రుగు అయింది. ఓటుకునోటు కేసులో చిక్కుకున్న ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌లు ఏ దిక్కూ లేని చోట అక్క మొగుడే దిక్క‌ని టీడీపీని ప‌ట్టుకుని వేలాడుతున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో ఎన్న‌డూ క‌లిసిరాని టీడీపీ తెలంగాణ జ‌నం ప‌ట్టించుకోవ‌డం మానేశారు. అయితె ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌నుస‌న్న‌ల‌లో ప‌నిచేస్తున్న రేవంత్ రెడ్డి ఈ మ‌ధ్య ఆంధ్రా – తెలంగాణ అంటూ తెగ ర‌చ్చ చేస్తున్నాడు.

తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత తెలంగాణ ప్ర‌భుత్వం ఆంధ్రా కాంట్రాక్ట‌ర్ల కొమ్ము కాస్తుంద‌ని, ఆంధ్రా వారికి తెలంగాణ సొమ్మును దార‌పోస్తుంద‌ని గుండెలు బాదుకోవ‌డం మొద‌లు పెట్టాడు. ఈ వంక‌తో అయినా వెళితే తెలంగాణ జ‌నం అంతో ఇంతో ఆద‌రిస్తార‌న్న ఆశ‌తో ప్ర‌తిదానికి ఆంధ్ర అంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. గ‌త కొన్ని రోజులుగా ఒలింపిక్ ప‌త‌కం సాధించిన పీవీ సింధుకు నాలుగుకోట్లు న‌గ‌దు బ‌హుమ‌తి, వెయ్యి గ‌జాల ఇల్లు ఇచ్చి తెలంగాణ సొమ్ము ఆంధ్రా అమ్మాయికి ఇచ్చాడ‌న్న‌ది రేవంత్ ఆరోప‌ణ‌.

అయితే ప‌దే ప‌దే ఈ విష‌యాన్ని మీడియాలో రేవంత్ ప్ర‌స్తావించ‌డంపై ఆంధ్రా టీడీపీ నేత‌లు గుస్సా అవుతున్నార‌ట‌. తెలంగాణ‌కు చెందిన సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, నిజామాబాద్ కు చెందిన అరికెల న‌ర్సారెడ్డికి టీటీడీ స‌భ్యులుగా ఆంధ్రాలో అవ‌కాశం ఇచ్చామ‌ని, వ‌రంగ‌ల్ కు చెందిన ఎల్వీ ఆర్కె ప్ర‌సాద్, ఖ‌మ్మంకు చెందిన సీతారామరావుల‌కు ఆంధ్రాలో కార్పోరేష‌న్ ప‌ద‌వులు ఇచ్చిన విష‌యాన్ని రేవంత్ మ‌రిచిపోయాడ‌ని, ఈ ప‌ద‌వులు ఆంధ్రా వారికి రావాల్సి ఉన్నా తెలంగాణ‌కు ఇచ్చామ‌ని, రేవంత్ ఇటువంటి విష‌యాలలో ఎక్కువ మాట్లాడొద్ద‌ని అంటున్నార‌ట‌.

కొస‌మెరుపు బాల‌కృష్ణ గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు తెలంగాణ ప్ర‌భుత్వం రాయితీ ఇవ్వ‌డం గురించి రేవంత్ నోరు తెర‌వ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. అయినా ఒలింపిక్ సాధించిన అమ్మాయిని దేశ గౌర‌వం నిల‌బెట్టిన వ్య‌క్తిగా చూడాలి గానీ ప్రాంతాల వారీగా విభ‌జించి మాట్లాడ‌డం ఈ రెండుకండ్ల పార్టీ నేత‌కే చెల్లింది.

NO COMMENTS

Leave a Reply