తెలంగాణొస్తే ఏమొచ్చింది – 1

రోజూ ఫేస్‌బుక్కు లోపలా, వెలుపలా జరుగుతున్న చర్చోపచర్చలు చూస్తున్నాను. తెలంగాణ వచ్చినంక ఏం మారింది? ఎవరు లబ్ది పొందారు? తీరిన సమస్యలెన్ని, తీరాల్సినవెన్ని? ఈ ప్రశ్నల చుట్టూ వాదోపవాదాలు.
మనం ప్రస్తుతం నిలబడ్డ ప్రదేశం నుండి మనకు ఏం కనిపిస్తుందో, అది ఇతరులకు కనిపించకపోవచ్చు. ఎవరి భావజాలం కళ్లద్దాల్లోంచి వారి వర్ణంలోనే జరుగుతున్న సంగతులు కనబడుతుండవచ్చు.

తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మిత్రుడు Rakesh Reddy Dubbudu, నేనూ తరచుగా ఒక అంశం గురించి మాట్లాడుకునే వాళ్లం. రేపు తెలంగాణ వచ్చినంక మనబోటి వాళ్లం ఏం చేయాలె అని.

ఉద్యమం వల్ల తెలంగాణ సమాజం ప్రపంచంలో మరే ఇతర సమాజం కానంతగా “కనెక్ట్” కాగలిగింది. ఆస్ట్రేలియా నుండి అమెరికా దాకా ఉన్న తెలంగాణ బిడ్డలు ఒకటే ఆశగా, శ్వాసగా కదిలారు. ఈ కనెక్ట్‌ను ఈ ఉద్యమస్ఫూర్తిని రేపటి తెలంగాణ కొరకు ఎట్లా ఉపయోగించుకోవాలె అనేది మా చర్చల్లో తరచూ వచ్చేది…
రాష్ట్రావతరణ జరిగి, ఉద్యమ దశ ముగిసాక రెండు స్పష్టమైన శిబిరాలుగా తెలంగాణ సమాజం నేడు కనపడుతున్నది. ఒకరు ఉద్యమం అనంతరం ఏర్పడ్డ తొలి తెలంగాణ ప్రభుత్వానికి మద్ధతు ఇచ్చే వర్గం, ఇంకొకటి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేక వైఖరి తీసుకున్న వర్గం.
ఈ రెండు వర్గాల గురించీ నేనిప్పుడు చెప్పబోవడం లేదు!

పై రెండు వర్గాలూ కాకుండా, తెలంగాణలో ఏమి జరుగుతున్నదో నిబద్ధతతో డాక్యుమెంట్ చేస్తూ, భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండాలో సూచనలు చేస్తూ, తెలంగాణ ఆత్మతో నిశ్శబ్దంగా పనిచేస్తున్న కొంతమంది మిత్రులను పరిచయం చేయడానికే ఈ పోస్టుల సిరీస్ రాస్తున్నాను. ఇందులో ఇది మొదటి భాగం:

మొదటగా చెప్పవలసింది విశ్వేశ్వర్ మంగళపల్లి (www.facebook.com/vishweshwer.mangalapalli) గురించి: బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ రంగంలో అత్యున్నత స్థాయిలో ఉండి కూడా ఈ తెలంగాణ భూమిపుత్రుని గుండె మాత్రం తెలంగాణ కొరకే కొట్టుకుంటోంది.

తెలంగాణ తొలి ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కొరకు మిషన్ కాకతీయ ప్రకటించగానే విశ్వేశ్వర్ కార్యరంగంలోకి దుంకిండు. ఏఏ చెరువులు తొలిదశలో మరమ్మత్తు చేస్తున్నారో లిస్టు సంపాదించి, ప్రతి వారాంతం బెంగళూరు నుండి తెలంగాణకు వచ్చి, మిషన్ కాకతీయ ఎట్లా జరుగుతున్నదో సవివరంగ, సచిత్రంగా డాక్యుమెంట్ చేశాడు. ఇంకా చేస్తున్నాడు. వారం వారం విశ్వేశ్వర్ రాసే ఆ నివేదికల కొరకు నేను ఆత్రంగా ఎదురుచూస్తాను.

నీళ్లను చూస్తే సంబరపడే ప్రతి తెలంగాణ బిడ్డా చదివితీరవలసిన నివేదికలవి. అట్లని విశ్వేశ్వర్ రాసే ఈ ఫీల్డ్ రిపోర్టుల్లో ప్రభుత్వ “భజన” కనిపించదు. ఒక నిష్ణాతుడైన వైద్యుడు ఇచ్చే డయగ్నోస్టిక్ రిపోర్టుల్లా ఉంటాయవి. చెరువు పునరుద్ధరణ మొదలైనప్పటి నుండి మొదలుకొని, పూర్తి అయ్యేంతవరకూ, ఆ తరువాత కొత్తగా వచ్చిన నీళ్లతో ఒక పంట పండే వరకూ అన్ని దశలనూ ఆయన జాగ్రత్తగా డాక్యుమెంట్ చేశాడు.

ఆ నివేదికల్లో కొండంత ఆశ ఉంటుంది. తెలంగాణ ఒక బంగరు భవితవైపు అడుగులువేస్తున్నదనే భరోసా కలిగిస్తాయా నివేదికలు. అక్కడక్కడా తప్పటడుగులు పడుతుండవచ్చు కానీ చూసే ఓపిక ఉండాలె కానీ మన చుట్టున్న తెలంగాణ, మారుతున్నది అని అవగతం అవుతుంది.

ఇక ఈ సంవత్సరం మంచిగా కాలం కావడంతో తెలంగాణవ్యాప్తంగా ఉన్న చిన్న, పెద్ద నీటి వనరుల్లో చేపల పెంపకాన్ని భారీ ఎత్తున చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోసారి విశ్వేశ్వర్ మంగళపల్లి రంగంలోకి దిగాడు.

31 జిల్లాలో ఏ చెరువులో ఎన్ని చేప పిల్లలు వేస్తున్నారో లెక్కలు తెప్పించుకున్నాడు. ఆయా జిల్లాల మత్స్య శాఖ అధికారులతో స్వయంగా మాట్లాడాడు. పథకం అమలవుతున్న తీరుతెన్నులను ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ చేస్తున్నాడు. ఈ చేపల పెంపకం వల్ల తెలంగాణ సమాజంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న బెస్త, ముదిరాజ్, గంగపుత్రులకు ఎంత ఆర్థిక పరిపుష్టి కలుగుతుందో ఆయన నివేదికలు చెబుతున్నాయి. ఏఏ రకాల చేపలను పెంచుతున్నారో, వాటి పెరుగుదల రేటు ఎట్లా ఉందో ఆయన నివేదికల్లో చూడవచ్చు మనం.

మిషన్ కాకతీయ, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అయితే తెలంగాణ స్వరూప స్వభావాలు మారతాయంటాడు విశ్వేశ్వర్. నీళ్లొస్తే కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, ఆ నీటితో చేపల పెంపకం, పర్యాటకం, వంటి రంగాల్లో నేరుగా దండిగా ఉపాధి లభిస్తుందని, పరోక్షంగా గొర్రెల పెంపకం వంటి రంగాలకు కూడా ఊతం లభిస్తుందని ఆయన నమ్మకం.
తెలంగాణకు ఇప్పుడు ఇట్లాంటి పాజిటివ్ ఆక్టివిజం ఎంతో అవసరం ఉన్నది. ప్రభుత్వం చేపడుతున్న వివిధ పధకాలు, రూపొందిస్తున్న విధానాలు క్షేత్ర స్థాయిలో ఎట్లా అమలవుతున్నాయో, వాటి వల్ల లబ్ది ఎట్లా జరుగుతున్నదో చెబుతూనే, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో, వాటిని ఎట్లా సరిదిద్దుకోవాలో చెప్పడం అన్నమాట.

ఇవ్వాళ తెలంగాణలో ఎందరో మిత్రులు విశ్వేశ్వర్ మంగళపల్లి చేస్తున్న పనిని సునిశితంగా గమనిస్తున్నారు. ఆయన రాస్తున్న నివేదికలు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయన కిందున్న సీనియర్ అధికారులు కూడా ఎంతో ఆసక్తితో పరిశీలిస్తున్నారు.

విశ్వేశ్వర్ మంగళపల్లి ఇదంతా చేయడానికి వెనుక ఏ స్వార్ధ ప్రయోజనాలూ లేవు. ఆయనేదో ఆశించో, ఆశతోనో ఈ పనులు చేయడం లేదు. కేవలం తెలంగాణ అంటే ఉన్న అమితమైన ప్రేమతోనే వారం వారం వందల కిలోమీటర్లు స్వంత ఖర్చుతో ప్రయాణం చేస్తూ, తన విలువైన సమయాన్ని వెచ్చిస్తూ ఈ మహా యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నాడు.
It is my individual duty to ensure Telangana is on the path of progress అంటాడు విశ్వేశ్వర్ ను కదిలిస్తే…
ఇంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను, ఇంకా బుడి బుడి నడకల స్థాయిలోనే ఉన్న తెలంగాణను చేయి పట్టి అభివృద్ధి పథంలో నడిపించడం ఒక పార్టీ బాధ్యతనో, ఒక నాయకుని బాధ్యతనో కాదని ఈ గడ్డ మీద పుట్టినోళ్లందరి భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుందని విశ్వేశ్వర్ నమ్మకం.

అతి కష్టం మీద వెలిగిన ఈ తెలంగాణ చిరుదివ్వెను ఏ గాలీ ఆర్పివేయకుండా అందరం తలొక చెయ్యీ అడ్డుగా పెట్టి ఈ చిరుదివ్వెను నిరంతరం జ్వలించే వెలుగు దివిటీగా మార్చాలంటాడు విశ్వేశ్వర్.

ఈ తెలంగాణ మిత్రునికి ….One Man Armyకి సలాం!
www.facebook.com/vishweshwer.mangalapalli
(త్వరలో ఇంకొందరు తెలంగాణ మిత్రుల గురించి)
Photos Courtesy: Vishweshwer Mangalapalli
[To be continued]

Story By :

Dileep Konatham

dk dk1 dk2 dk3 dk4

NO COMMENTS

Leave a Reply